వీసా కావాలంటే ఆ వివరాలు చెప్పాల్సిందే
వీసా మంజూరు విషయంలో అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకముందు దరఖాస్తుదారులు తాము అనుసరిస్తున్న సామాజిక మాధ్యమాల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. అమెరికాలోని ప్రవేశించే విదేశీయుల పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు తాజాగా ఈ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాత్కాలిక పర్యాటకులు సహా అందరూ ఈ వివరాలను డ్రాప్ డౌన్ మెనూ రూపంలో పొందుపరచవలసి ఉంటుంది. ఒకవేళ సామాజిక మాధ్యమాలను ఉపయోగించకపోతే దరఖాస్తులో ఆ విషయాన్ని ప్రస్తావించాలి. తప్పుడు సమచారం ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని అమెరికా విదేశీ వ్యవహారాల అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికగా మారిన నేపథ్యంలో ఈ వివరాలను సేకరించాల్సి వస్తోందని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తరువాతే వీసాలు మంజూరు చేస్తారు. మున్నుందు దరఖాస్తుదారుడు అంతవరకు చేసిన ప్రయాణ వివరాలను కూడా పేర్కొనాల్సి ఉంటుంది.













