సిక్కోలు తుపాను బాధితులను ఆదుకుంటాం – జయరామ్ కోమటి
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్ కోమటి ఈరోజు తుపాన్‌తో దెబ్బతిన్న సిక్కోలులో పర్యటించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు ఆయన బాధిత ప్రాంతాలను సందర్శించి వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాన్‌తో ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని, ఇక్కడి బాధితులకు తక్షణ చర్యగా ఏమి సాయం చేయాలి, తరువాత వారికోసం శాశ్వతంగా చేయాల్సిన పనులపై అంచనా వేసినట్లు చెప్పారు. దీనిపై అమెరికాలోని ఎన్నారై టీడిపి కార్యవర్గంతో చర్చించి సహాయం చేస్తామని, ఇప్పటికే ఎన్నారై టీడిపి నాయకులు తుపాన్ బాధితులను ఆదుకునేందు కోసం రంగంలో దిగారని కూడా ఆయన చెప్పారు. ఎపిలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అమెరికాలో తెలుగు సంఘాలైన ‘తానా’, నాట్స్ లాంటి సంఘాలు ముందుకు వచ్చి సహాయాన్ని అందిస్తున్నాయని చెప్పారు. గతంలో హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు కూడా ఎన్నారై టీడిపితోపాటు అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా తమవంతు సహాయాన్ని అందించాయని, ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను మా వంతుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఎపి జన్మభూమి కింద ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను, గ్రామాల్లో శ్మశానవాటికల అభివృద్ధి, అంగన్వాడీ కేంద్రాలకు కావాల్సిన సహాయాన్ని ఆయన ఎన్నారైల సహకారంతో చేస్తున్న సంగతి తెలిసిందే.













