రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి.. అండగా మేముంటాం
అవినీతికి దూరంగా, అభివద్ధికి దగ్గరగా ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్నారైలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని కూడా ఆయన పిలుపునిచ్చారు.
తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జగన్ ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడారు. వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ”ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్పూర్తిదాయకం. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కల. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది నా కల. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్నది నా కల. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల. పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదు. రెండున్నర నెలల పరిపాలనలోనే చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, మద్యం బెల్టు దుకాణాల మూసివేత చేపట్టాం. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశాం” అని చెప్పారు.
”అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలని నిర్ణయించాం. దేశంలో కనీవినీ ఎరుగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నాం. పాఠశాలలు, ఆసుపత్రుల ప్రస్తుత ఫొటోలు చూపిస్తున్నాం. తర్వాత నాడు, నేడు అంటూ అభివృద్ధి చేసిన పాఠశాలలు, ఆసుపత్రుల ఫొటోలు చూపిస్తాం.
కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా తెలుగుఎన్నారైలు ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందాం. ప్రభుత్వం వెబ్సైట్లో ఒక పోర్టల్ ఏర్పాటుచేయనున్నది. ఈ పోర్టల్ నేరుగా సీఎం కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్‌లో చెప్పొచ్చు. పోర్టల్ పర్యవేక్షణకు ఒక అధికారిని నియమిస్తాం” అని జగన్ తెలిపారు. ఈ కార్యక్రమా నికి ప్రవాసాంధ్రులు భారీగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో సౌత్‌లేక్ మేయర్ లారా హిల్, తెలుగు కమ్యూనిటీ ప్రముఖులు, నాటాఅడ్వయిజర్ డా.ప్రేమ్‌సాగర్‌రెడ్డి, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆత్మచరణ్‌రెడ్డి, నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కడప రత్నాకర్, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుడివాడ అమరనాధ్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, యార్లగడ్డ శివరాం, తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి, టాటా నుండి పైళ్ల మల్లారెడ్డి, డాటా నుండి పోలీస్ చంద్రారెడ్డి, టీడిఎఫ్ నుండి కలవాల అజయ్, విశ్వేశ్వర్ కలవాల,నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, సిలికానాంధ్ర నుండి కూచిభొట్ల ఆనంద్, దీనబాబు కొండుభట్ల, తదితరులు పాల్గొన్నారు.
వాషింగ్టన్‌డీసీలో…
వాషింగ్టన్‌డీసీలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని జగన్మోహన్రెడ్డి తెలిపారు. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక సమావేశానికి సీఎం హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లాతో సీఎం సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు.
గ్లోబల్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ క్లేనెస్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. సోలార్ పవర్ ఉపకరణాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన జాన్స్ కంట్రోల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్ కంట్రోల్స్ ప్రతినిధులు చెప్పారు. పట్టణాభివద్ధి, జల నిర్వహణలో సహకారం అందించేందుకు సిద్ధమని జీలీడ్ సైస్సెస్ వెల్లడించింది. వ్యవసాయ పరిశోధన లో ఏపీకి సహకరిస్తామని సభ్యులు పేర్కొన్నారు.
వాషింగ్టన్ డీసీలో ఘనంగా వీడ్కోలు
వాషింగ్టన్ డీసీ నుండి వెళుతున్నప్పుడు ఆయనకు ఇక్కడి ఎన్నారైలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గొలుగూరి శ్రీనివాస త్రిమూర్తి రెడ్డి కుటుంబ సభ్యులు జగన్‌కు అమెరికా క్యాపిటల్ నమూనాను జ్ఞాపికగా బహుకరించారు. తన పర్యటన విజయవంతం కావడానికి సాయపడిన డీసీ ప్రవాసులకు, డల్లాస్ ఎన్నారైలకు, వైఎస్ఆర్సిపి యుఎస్ విభాగానికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.













