అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం నటినయ్యా
అనారోగ్యం పాలైన అమ్మ ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికే తాను నటనను ఎంచుకున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ వెల్లడించారు. సినీ రంగంలో తాను గొప్ప విజయాలను నమోదు చేసినప్పటికీ కెమెరా ముందు తనకెందుకో అంత సౌకర్యంగా, సహజంగా అనిపించదని ఆమె వెల్లడించారు. తనకు బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చినపుడు ఉత్పన్నమైన పరిణామాలను తట్టుకోవడానికి ఎంతో ఒత్తిడికి గురైనట్లు చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే తన స్వభావ విరుద్ధమైన నటనవైపు తాను మొగ్గాల్సి వచ్చిందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పైగా, 17-18 ఏళ లేత వయసులో కెమెరా ముందుకు రావడం, నటించడంతో పాటూ ఆసలు నిర్దిష్ట అభిప్రాయాలేవీ లేకుండానే మీ మనోగతం ఏమిటో చెప్పండి వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చేదన్నారు. నటన ఓ అద్భుత సృజనాత్మక రంగం, అయినప్పటికీ తాను మరో కోవకు చెందిన వ్యక్తినంటూ ఆమె తన మనసు విప్పి చెప్పారు.













