8 Vasanthalu: క్లీన్ అండ్ నీట్ మూవీ ‘8 వసంతాలు’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
తారాగణం: అనంతిక సనిల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా,
స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ తదితరులు
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రఫీ : విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్, యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
ఎడిటర్: శశాంక్ మాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
సి ఈ ఓ : చెర్రీ (చిరంజీవి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిడివి : 2 ఘంటల 20 నిముషాలు
‘మను’ తర్వాత ఫణీంద్ర నర్సెట్టి(Phanidra Narsetty) దర్శకత్వం వహించిన సినిమా ‘8 వసంతాలు’. సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్ని దృష్టిని సినిమా వైపు తిప్పాయి. ఫణీంద్ర నర్సెట్టి తీసిన ‘మధురం’కు అభిమానులు ఉన్నారు. అంతకు మించి పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటివల వస్తున్న సినిమాలలో విపరీతమైన విధ్వంసం, మితిమీరిన హింస, ఏర్లుగా పారే రక్తపాతాలే కనిపిస్తున్నాయి. ఓ నదిలా పారే ప్రేమ కథ, పిల్లగాలిలా వీచే స్వచ్చమైన ప్రణయ గీతాలు, గుండెల్ని బరువెక్కించే భగ్న ప్రేమ కథలు రావడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అసలు ప్రేమ నిర్వచనాన్ని చెప్పేందుకు ఫణీంద్ర నర్సెట్టి స్వచమైన తెలుగు టైటిల్ తో ‘8 వసంతాలు’ అని వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుందో ఓ సారి రివ్యూ చూద్దాం.
కథ :
శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్)(Ananthika Sunil Kumar) పని పట్ల అకింత భావం, ఏదైనా సాధించగల పట్టుదల, కొండంత ధైర్యం, అంతులేని సాహసాన్ని ప్రదర్శించే ఓ యువ రచయిత్రి. పదిహేడేళ్లకు ఓ పుస్తకం (RAYS) రాస్తుంది. అది చదివిన ఎంతో మంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో రచయిత్రి మాత్రమే కాదు… తల్లిపై ప్రేమ, తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న గురువు మీద భక్తి, స్నేహితుల పట్ల కరుణ ఉంటాయి. రైటింగ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అంటూ తన ప్రపంచంలో ఉన్న శుద్ధి అయోధ్యకు వరుణ్ (హను రెడ్డి) పరిచయం అవుతాడు. ప్రేమ పేరుతో ఆమె వెంట పడతాడు. శుద్ధి అయోధ్య ప్రేమించే సరికి ఆమె హృదయాన్ని ముక్కలు చేసి విదేశాలకు వెళతాడు. ఆ హార్ట్ బ్రేక్ నుంచి కోలుకుని మరో పుస్తకం రాసిన ఆమెకు… ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు. అతడిని త్రికరణశుద్ధిగా శుద్ధి అయోధ్య ప్రేమిస్తుంది. అయితే తన ప్రేమ సంగతి తల్లికి చెబుదామనుకున్న శుద్ధి అయోధ్యకు… అనుకోకుండా ఫ్యామిలీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత తల్లి సంతోషం కోసం ప్రేమను త్యాగం చేయాలని భావిస్తుంది. అసలు శుద్ధి అయోధ్యను సంజయ్ ప్రేమించాడా? కుమార్తె ప్రేమ విషయం తల్లికి తెలిసిందా? విదేశాల నుంచి వరుణ్ వచ్చాడా? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా కథ.
నటీ నటుల హవబవాలు :
శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్ కుమార్ చక్కగా నటించింది.ఆమె గురించి ముందు చెప్పుకోవాల్సిందే. అందం అంటే ఏంటి? అని ఫణీంద్ర ఇందులో చాలా పెద్ద డైలాగులే రాశాడు. ఆ డైలాగ్స్ అన్నీ కూడా అనంతికకు వర్తిస్తాయి. అందం అంటే గుణం, ధైర్యం, సాహసం, కరుణ ఇలా అన్నీ కూడా అనంతికలో ఉన్నాయి. అనంతికను చూస్తుంటే ప్రేక్షకులకు తెలియని ఓ ప్రేమ, గౌరవం, అభిమానం, ప్రేమ పుట్టుకొచ్చేస్తాయి. తెరపై ఆమె కట్టూబొట్టూ, నడవడిక ఇలా అన్నీ కూడా మెప్పిస్తాయి. ప్రేమైనా, బాధైనా, పోరాటాలైనా ఆమె తెరపై మాయ చేసిందని చెప్పుకోవచ్చు. కశ్మీర్‌లో వరుణ్ ప్రపోజ్ చేసిన సన్నివేశం మినహా మిగతా సినిమా అంతా ఆమె నటన ఆకట్టుకుంటుంది. హను రెడ్డి హ్యాండ్సమ్‌గా ఉన్నారు. అనంతిక, హను రెడ్డి జంట బావుంది. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. మరో హీరో రవి దుగ్గిరాల చాలా ఇంప్రూవ్ అవ్వాలి. షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ సిరీస్‌లు చాలా చేసిన కన్నా పసునూరి తన పాత్రకు న్యాయం చేశారు. మిగతా నటీనటుల్లో గుర్తు ఉంచుకోదగ్గ నటన కనబరిచిన వాళ్ళు అంతగా ఎవరూ లేరు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఫణీంద్ర నర్సెట్టి విషయం ఉన్న ఫిల్మ్ మేకర్, అంతకు మించి చక్కటి రైటర్. ‘8 వసంతాలు’ చూస్తే… ఆయనలో మంచి విజువల్ సెన్స్, మ్యూజిక్ టేస్ట్ ఉన్నాయని సగటు సాధారణ ప్రేక్షకులు సైతం చెబుతారు. సిల్వర్ స్క్రీన్ మీద మంచి విజువల్ మ్యూజికల్ పోయెట్రీని చెప్పాలని ప్రయత్నించారు. ఆ విజువల్స్ చాలా చక్కగా తెరపైకి వచ్చాయి. మ్యూజిక్ మనసును తాకుతుంది. కానీ, పోయెట్రీ మాత్రం తెరపైకి రాలేదు. ఆయనలోని మేకర్‌ను రైటర్ మరీ తొక్కేశాడు. రచనలో కవిత్వం మరీ ఎక్కువైంది. ‘8 వసంతాలు’ సినిమాలోని ప్రతి మాటలో తనలోని కవిని ప్రేక్షకులకు పరిచయం చేయాలని, ప్రతి సంభాషణ కవితాత్మకంగా ఉండాలని ఫణీంద్ర నర్సెట్టి పడిన తాపత్రయం కనిపించింది. ఈ క్రమంలో ప్రాసకు ప్రాముఖ్యం పెరిగింది. దాంతో భాషకు, భావానికి, భావుకతకు మధ్య డైలాగ్ నలిగింది. పాత్రోచితం దెబ్బ తింది. పదిహేడేళ్లు నిండని అమ్మాయిలో తండ్రి మరణం రచయిత్రికి జన్మ ఇచ్చింది. ఆ అమ్మాయి గుండెకు గాయమైనప్పుడు మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంతటి బలమైన సన్నివేశాలు ఉండాలి. ‘8 వసంతాలు’లో అది కొరవడింది.కశ్మీర్ అందాలు, ఊటీ వాతావరణాన్ని తెరపై ఎంతో ఆహ్లాదకరంగా, అద్భుతంగా చూపించారు. విజువల్స్ ఎంతో రిచ్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. టెక్నికల్‌గా ఈ మూవీకి మంచి మార్కులే పడతాయి. పాటల్ని తెరపై అందంగా తెరకెక్కించారు. హేషమ్ ఇచ్చిన బీజీఎం హార్ట్ టచింగ్ ఉంటుంది. వారణాసి ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది. కథ, కథనంలో ఇంకాస్త ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంటే రిజల్ట్ వేరేలా ఉంటుంది. కొన్ని చోట్ల మాటలు మాత్రం ఈ సినిమాకు ప్రధాన బలం.
విశ్లేషణ :
ఇక 8 వసంతాలు అంటూ అప్పటి వరకు మనం చూసిన కోణం వేరే.. ఇంకో కోణం ఉందని ప్రీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే అక్కడ కొన్ని చోట్ల ప్రేమ అంటే ఏంటి? అని రాసుకున్న డైలాగ్స్ ప్రవచనాల్లా, నీతుల్లా అనిపిస్తాయి. అవి వినే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. అసలు ఈ సినిమాలో చాలా చోట్ల మాటలు ఇలా హితబోధ చేసినట్టుగా, నీతులు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కొంత మందికి ఫణీంద్ర రాసిన డైలాగ్స్ గొప్పగా అనిపిస్తే.. ఇంకొంత మందికి ఇవి ఇన్ స్టా, ఫేస్ బుక్ కొటేషన్లు, ఆటో వెనకాల రాసుకునే డైలాగ్స్ అనిపించొచ్చు. కొన్ని డైలాగ్స్‌లో మాత్రం చాలా డెప్త్ కనిపిస్తుంది. అలా ఈ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ మాత్రం డైలాగ్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల తరువాత ఇంత కవిత్వం, ఇంత లోతైన భావం కలిగిన మాటలు విన్నామన్న ఫీలింగ్‌తో బయటకు వస్తారు. అందులో కొన్ని అర్థం కావొచ్చు కాకపోవచ్చు కానీ మాటలు మాత్రం మెదడులోకి, గుండెల్లోకి వెళ్తాయి. అయితే ఆడియెన్స్‌కి ఇలాంటి ఓ డెప్త్, ఇంటెన్స్ లవ్ స్టోరీలు ఇప్పుడు ఎక్కువతాయా? ఇప్పుడున్న ట్రెండ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపిస్తుందా? అంటే చెప్పలేం. ఇప్పుడే చెప్పలెము, అందరికీ ఈ 8 వసంతాలు అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కవితాత్మక హృదయం వున్నవాళ్ళకు నచ్చుతుందేమో చూడాలి.