తమన్, దేవీలకు అతను పోటీ ఇస్తాడా?
టాలీవుడ్ లో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ పెరుగుతుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లెంత మంది ఉన్నా కొత్త వారికి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉంటాయి. కానీ కొత్త వాళ్లు స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించే ఛాన్స్ అందుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. ముందు మీడియం రేంజ్ హీరోలకు సరైన మ్యూజిక్ ఇస్తే వాటంతటవే పాన్ ఇండియా ఆఫర్లు కూడా వస్తాయి.
కొత్త రకం సంగీతంతో ఎట్రాక్ట్ చేయడమంటే ఇప్పుడు మామూలు విషయం కానే కాదు. టాలీవుడ్ లో సీనియర్లు కూడా ఆల్బమ్ మొత్తం చార్ట్ బస్టర్లు ఇవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి పోటీగా వేరే భాషల నుంచి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు తమ సత్తా చాటుకోవాలని ముందుకొస్తున్నారు. ఇప్పటికే రవి బస్రూర్, సంతోష్ నారాయణన్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లోకి జేక్స్ బెజోయ్ చేరాడు. వచ్చే వారం రిలీజ్ కానున్న సరిపోదా శనివారం సినిమాకు అతనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా బీజీఎం, సాంగ్స్ విషయంలో అతని పనితనాన్ని నాని మెచ్చాడు. ట్రైలర్ లో బీజీఎం కూడా తన రేంజ్ ఏంటో చూపించింది. దీంతో పాటూ మెకానిక్ రాఖీ సినిమాకు మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతుందని ఇప్పటికే విశ్వక్సేన్ చాలా నమ్మకంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తుంటే జేక్స్ కు ఇప్పుడున్న టైమ్ చాలా ముఖ్యమనేది అర్థమవుతుంది. తన హీరోలు మాత్రం ఆయన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. ఏ మాత్రం జేక్స్ వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నా దేవీ శ్రీ ప్రసాద్, తమన్ లాంటి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్లకు తను మంచి పోటీ ఇచ్చే అవకాశముంది.













