చిరూ-పూరీ సినిమా లేట్ కి కారణం అదేనా?
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని, తన డబ్బింగ్‌ను ఫినిష్ చేసి భార్యతో విదేశాలకు చెక్కేశాడు చిరూ.
విదేశాల నుంచి వచ్చాక తన తర్వాతి సినిమాను బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చేయనున్నాడు. భోళా శంకర్ రిలీజ్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే గాడ్ ఫాదర్ తర్వాత చిరూ, పూరీతో ఓ వెబ్ చాటింగ్ వీడియోలో పాల్గొన్నారు. ఆ వీడియోలో మంచి కథ రెడీ చేసుకుని రమ్మని పూరీకి చిరూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
చిరూ చెప్పినట్లే మంచి స్టోరీని రెడీ చేసుకున్న పూరీ, ఆ కథతో చిరూని మెప్పించారట కూడా. కానీ పూరీ అప్పటికే రామ్ తో డబుల్ ఇస్మార్ట్ కమిట్ అయి ఉండటంతో, ముందు ఆ సినిమా ఫినిష్ చేసుకుని రమ్మని చెప్పి పూరీ సినిమాను హోల్డ్ లో పెట్టాడు చిరూ. ఈ లోపు కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ సినిమాలు ఫినిష్ చేసుకోవాలనేది చిరూ ప్లాన్.
పూరీ చెప్పిన కథ బాగున్నా ఆయన టేకింగ్ పై నమ్మకం లేకనే మరో సినిమాను పూర్తి చేసుకుని రమ్మని మెగాస్టార్ చెప్పాడని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. కానీ దానికంటే ముందే చిరూ వేరే సినిమాలకు కమిట్ అవడంతో పూరీ వేరే సినిమా చేసేలోపు ఇవి పూర్తి చేయాలనే ఉద్దేశంతో చిరూ పూరీ సినిమాను హోల్డ్ లో పెట్టాడనేది మెగాఫ్యాన్స్ అంటున్న మాట. ఈ రెండింటిలో ఏది నిజమో తెలియదు కానీ డబుల్ ఇస్మార్ట్ తో పూరీ హిట్ కొడితే మెగాస్టార్ తో సినిమా ఖాయమనేది మాత్రం కచ్ఛితంగా తెలుస్తోంది.













