నెక్ట్స్ ఏంటి అనుదీప్?
2021లో జాతి రత్నాలు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ కేవీ అనుదీప్. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా ముగ్గురు ఆర్టిస్టులతో అనుదీప్ పండించిన నవ్వులకు జనాలు బ్రహ్మరథం పట్టి కలెక్షన్ల వర్షం కురిపించారు. తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా బావున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఇదంతా జరిగి రెండేళ్లు దాటుతుంది. ఈ మధ్య అనుదీప్ డైరెక్టర్ గా కాకుండా నటుడిగా కనిపిస్తున్నాడు. గతేడాది మ్యాడ్ సినిమాలో క్యామియో చేసిన అనుదీప్, నిన్న కల్కిలో కూడా మెరిశాడు. ఆ సినిమా డైరెక్టర్లు అనుదీప్ కు ఫ్రెండ్స్ కావడమే ఈ క్యామియోలు చేయడానికి కారణం. ప్రస్తుతం అనుదీప్ డైరెక్టర్ గా ఏ సినిమా చేయట్లేదు.
ముందు వెంకటేష్ తో ట్రై చేశాడు. స్టోరీ లైన్ నచ్చినా ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. తర్వాత రవితేజతో సినిమా అనుకున్నారు కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చిరంజీవి కోసం ఓ కథ రెడీ చేశాడు. ఆ కథ మెగాస్టార్ కు నచ్చినప్పటికీ ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇదంతా ప్రిన్స్ సినిమా ఎఫెక్టా అంటే కాదు. ప్రిన్స్ సినిమా బాలేదు కాదు, ఆ కథ శివ కార్తికేయన్ కు సెట్ కాలేదంతే. ఈ మాత్రం దానికి అనుదీప్ ఇన్నేళ్లు ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదు. అనుదీప్ తన తర్వాతి సినిమాకు ఇంకెంత టైమ్ తీసుకుంటాడో చూడాలి.













