Viswaksen: ఫ్యాన్స్ కు విశ్వక్ బహిరంగ లేఖ.. ఏమన్నాడంటే
సినిమా సినిమాకీ డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుంటూ, కొత్త ప్రయోగాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswaksen) రీసెంట్ గా లైలా(Laila) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రామ్ నారాయణ్(Ram Narayan) దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. షైన్ స్క్రీన్స్(Shine Screens) బ్యానర్ లో సాహు గారపాటి(Sahu Garapati) నిర్మించిన ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించాడు.
లైలా సినిమాపై నమ్మకంతో విశ్వక్ ఎంతో కాన్ఫిడెంట్ గా సినిమా అందరినీ అలరిస్తుందని ఆ చిత్ర ప్రమోషన్స్ లో చెప్పాడు. కానీ సినిమా రిలీజయ్యాక చూసిన ప్రతీ ఒక్కరూ ఆ సినిమాను వ్యతిరేకించినవాళ్లే. విశ్వక్ కెరీర్లోనే లైలా బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ అని, అసలు ఇలాంటి అసభ్యకర మూవీ ఎలా తీశావని నెట్టింట విశ్వక్ ను ఏకిపారేశారు. లైలా అందరినీ నిరాశకు గురి చేసిన నేపథ్యంలో హీరో విశ్వక్ ప్రేక్షకులకు బహిరంగ లేఖ రాశాడు.
“ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ.. నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు” అని విశ్వక్ రాసుకొచ్చాడు.
దాంతో పాటూ ”నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని విశ్వక్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.













