విక్రమార్కుడు సీక్వెల్ కు స్టోరీ సిద్ధం.. కానీ!
రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే విక్రమార్కుడు సినిమానే. ఈ సినిమా రవితేజను స్టార్ హీరోని చేసింది. అప్పటివరకు కామెడీ మాస్ హీరోగా ఉన్న రవితేజ విక్రమార్కుడు తర్వాత ఓ పవర్ఫుల్ సీరియస్ హీరోగా కూడా మంచి నటనను కనబరచగలడని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రవితేజ కమర్షియల్ యాక్షన్ కామెడీలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేశాడు.
వాటిలో ఎక్కువ భాగం సినిమాలు హిట్టయ్యాయి. అలా కాకుండా పూర్తిగా రూట్ మార్చి పూర్తి సీరియస్ నోట్ లో చేసిన సినిమాలు మాత్రం డిజాస్టర్లయ్యాయి. విక్రమార్కుడు సినిమా రిలీజయ్యి ఇప్పటికే 18 ఏళ్లయింది. ఈ సినిమా వేరే భాషల్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా మంచి హిట్ గా నిలిచింది. అయితే విక్రమార్కుడు సీక్వెల్ గురించి ఇన్నేళ్ల తర్వాత ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది.
శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధామోహన్, విక్రమార్కుడు కు సీక్వెల్ గా విక్రమార్కుడు2 చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. విక్రమార్కుడు సీక్వెల్ రైట్స్ తను తీసుకున్నట్లు, ఇప్పటికే దానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ కూడా రెడీ చేశారని తెలిపాడు. కానీ రవితేజ మాత్రం ఈ సీక్వెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని, రాజమౌళితో తప్ప మరో డైరెక్టర్ తో విక్రమార్కుడు సీక్వెల్ చేయలేనని చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని రాధామోహన్ క్లారిటీ ఇచ్చాడు. మరి రవితేజ తో కాకుండా మరో హీరోతో అయినా రాధా మోహన్ ఈ సీక్వెల్ ను పట్టాలెక్కిస్తాడా అన్నది చూడాలి.













