ఆరేళ్లలో 25 సినిమాలంటే మాటలా..
పాత హీరోలు ఒకప్పుడు సంవత్సరానికి 5 నుంచి 10 సినిమాలు చేస్తారని వినడమే తప్ప ఈ తరం హీరోల్లో మాత్రం ఎవరూ అలా ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకరిద్దరు హీరోలు మాత్రం సంవత్సరానికి మినిమం రెండు నుంచి మూడు సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా తీయడానికి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో హీరోలు ఒకేసారి ఎక్కువ సినిమాలు చేసేందుకు ముందుకు రావట్లేదు.
ఇలాంటి టైమ్ లో విజయ్ సేతుపతి ఏడాదికి దాదాపు 6 నుంచి 10 సినిమాలు చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంవత్సరానికి 10 సినిమాలు చేయడమంటే మామూలు విషయమే కానీ హీరోగా, విలన్ గా మరోవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎక్కువ సినిమాలు చేయడం ఒక్క సేతుపతికే చెల్లింది. సేతుపతికి ఈ మధ్య పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం వల్ల అన్ని భాషల్లోనూ మంచి ఆఫర్లొస్తున్నాయి.
గత ఆరేళ్లలో ఆయన ఏకంగా 25 సినిమాలు చేసి రికార్డు సృష్టించాడు. తక్కువ టైమ్ లోనే పాతిక సినిమాలు చేయడం వల్ల సేతుపతి 50 సినిమాలను త్వరగా పూర్తి చేయగలిగాడు. రీసెంట్ గా అతని కెరీర్లో 50వ సినిమాగా వచ్చిన మహారాజా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.













