నటుడు పొట్టి వీరయ్య కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య(74) తనువు చాలించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరయ్య తుదిశ్వాస విడిచాడని వైద్యులు వెల్లడించారు. వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. పొడవు తక్కువగా ఉండటం వల్ల అతడికి సినిమా అవకాశాలు వచ్చాయి. అలా విఠలాచార్య ‘అగ్గివీరుడు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు.
తాతామనవడు, రాధమ్మ పెళ్లి, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి సుమారు 500కి పైగా చిత్రాల్లో నటించాడు. సినిమాల్లో అవకాశాలు లేక కృష్ణ నగర్ లో టెలిఫోన్ భూత్ నడిపేవాడు, మొబైల్ ఫోన్స్ వచ్చిన తరువాత అది కాస్త మూతపడింది. ఆర్ధికంగా కష్టాల్లో వున్నా పొట్టి వీరయ్య ను ‘మా’ సహకారం అందించింది. దివగంత డా. దాసరి నారాయణ రావు, మెగాస్టార్ చిరంజీవి కూడా అతని కుటుంబాన్ని ఆదుకున్నారు.













