విశ్వంభరపై అంచనాలు పెంచిన డైరెక్టర్
తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలని చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే సైరా నరసింహా రెడ్డి పేరుతో పాన్ ఇండియా సినిమా చేశాడు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితమివ్వలేకపోయింది. దీంతో మళ్లీ చిరూ రీజనల్ సినిమాలకే పరిమితమయ్యాడు.
అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి వశిష్ట అనే దర్శకుడితో విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చిత్ర వర్గాలంటున్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి తరహాలో ఫాంటసీ టచ్ ఉన్న విజువల్ వండర్ ను వశిష్ట- చిరూ కలిసి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ వశిష్ట తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు విశ్వంభరపై హైప్ ను పెంచుతున్నాయి. విశ్వంభరకు జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాలే రిఫరెన్స్ అని మరోసారి చెప్పిన వశిష్ట, ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని, చిరూ కెరీర్లో టాప్5 సినిమాల్లో విశ్వంభర కూడా ఒకటిగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపాడు. ఈ సినిమాను చిరూ ఫ్యాన్స్ లాంగ్ టైమ్ గుర్తుపెట్టుకుంటారని, ఆడియన్స్ ను విశ్వంభరతో మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మార్వెల్ సినిమాల లెవెల్ లో ఉంటుందని కూడా వశిష్ట వివరించాడు. వశిష్ట చెప్పిన మాటలు ఈ సినిమాపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.













