వరుణ్ లైనప్ భలే ఉందే
వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం అనుకున్న స్థాయిలో లేదు. వరుణ్ గత సినిమాలు గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్లయ్యాయి. ఈ నేపథ్యంలో వరుణ్ సినిమాల ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ట్రెండ్ కు సెట్టయ్యే కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగానే కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు వరుణ్.
వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథతో ఈ సినిమా రూపొందుతుంది. షూటింగ్ దశలో ఉన్న మట్కా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే సినిమాల గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ సినిమా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఇయర్ లోనే మొదలుపెట్టాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత విక్రమ్ సిరికొండతో కూడా వరుణ్ ఓ సినిమా చేయనున్నాడు. ఏఐ బేస్డ్ గా నడిచే లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు క్యాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో డైరెక్టర్ బిజీగా ఉన్నాడట. ఈ మూడు సినిమాలపై వరుణ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొత్తానికి వరుణ్ క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.













