Usha Mulpuri: బాధనిపించినా అందుకే దూరంగా ఉంటున్నాం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగశౌర్య(naga shaurya) కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు 15 ఏళ్లవుతున్నా శౌర్య ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్లు ఎక్కువేమీ లేవు. రంగబలి తర్వాత నాగశౌర్య కెరీర్లో అనుకోకుండా గ్యాప్ వచ్చింది. అయితే శౌర్య 2022లో అనుషా శెట్టి(anusha Shetty) అనే బెంగుళూరుకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోగా గతేడాది వారికి ఓ పాప పుట్టింది. కాగా రీసెంట్ గా శౌర్య గురించి తన తల్లి ఉషా ముల్పూరి(Usha Mulpuri) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శౌర్య పెళ్లి తర్వాత ఇంట్లో తల్లిదండ్రులతో కాకుండా వేరే కాపురం పెట్టాడని, అతని చిన్నప్పుడే పెళ్లయ్యాక కలిసి ఉండనని శౌర్య చెప్పేవాడని, ఇద్దరు మంచి వాళ్లు ఒకేచోట ఉండకూడదనే నమ్మకం శౌర్యది అని ఉష తెలిపారు. ఆ నమ్మకంతోనే పెళ్లి తర్వాత వేరే ఇంట్లో ఉంటున్నాడని, అనూష చాలా మంచి అమ్మాయి అని, తనను కోడలిగా కాకుండా కూతురిగానే చూసుకున్నానని, అనూష కూడా తమను తల్లిదండ్రుల్లానే చూసుకుంటుందని చెప్పారు.
అయితే పెళ్లికి ముందే అనూషతో వేరే కాపురం గురించి చెప్పామని, దూరంగా ఉంటేనే రిలేషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయనిపించి, బాధ అనిపించినా దానికే కట్టుబడి ఉన్నట్టు ఉష చెప్పారు. తన ఇద్దరు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండటంతో స్కూల్ కు కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచి చదివిస్తూ రోజంతా వాళ్లతోనే ఉండే తనకు, పెళ్లి చేసుకుని వాళ్లు వేరే ఇంటికి వెళ్లడంతో ఇళ్లంతా బోసిపోయినట్టు అనిపిస్తోందని ఎమోషనల్ అయింది ఉష.













