రవితేజ కోసం ఆ ఇద్దరూ వెయిటింగ్
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో రవితేజ ఒకడు. అందుకే రవితేజ ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటాడు. అతన్నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రెండూ నిరాశ పరిచినప్పటికీ, ఆ ఫ్లాపులకు నిరాశ పడకుండా తన నెక్ట్స్ సినిమా ఈగల్ పై ఫోకస్ పెట్టాడు.
ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు రవితేజ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈగల్ తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో రానున్న నాలుగో సినిమా కావడంతో దీనిపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఆ తర్వాత రవితేజ తో సినిమా చేయడానికి ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అందులో ఒకరు హరీష్ శంకర్ కాగా, మరొకరు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈ డైరెక్టర్లిద్దరూ రవితేజతో పనిచేసిన వాళ్లే. ఉస్తాద్ భగత్‌సింగ్ లేటవుతుంది కాబట్టి ఈలోపు రవితేజతో ఓ సినిమా చేయాలని హరీష్ ట్రై చేస్తుండగా, భగవంత్ కేసరి హిట్‌తో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి కూడా రవితేజతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ ఇద్దరిలో రవితేజ ఎవరితో ముందు సెట్స్ పైకి వెళ్తాడన్నది చూడాలి.













