రీమేక్‌లకు కలిసిరాని 2023
ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో సక్సెస్ కంటే ఫ్లాపులే ఎక్కువున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ దాదాపు నిరాశ పరిచినవే. అందులో రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ రీమేక్ సినిమాలు చేశారు. కానీ అవేమీ పెద్దగా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయకపోగా నిరాశను మిగిల్చాయి.
ప్రేక్షకులు ఒకప్పటిలా లేరిప్పుడు. సినిమా బాగుందంటే చాలా భాషతో సంబంధం లేకుండా ఆ సినిమాను ఓటీటీలో వెంటనే చూసేస్తున్నారు. అలాంటప్పుడు ఇక మన హీరోలు రీమేక్ చేసినా ఏం లాభముంటుంది. 2023లో భారీ అంచనాలతో వచ్చి నిరాశ పరిచిన సినిమాల్లో ముందుగా మాట్లాడేది ఎవరైనా సరే భోళా శంకర్ గురించే.
వేదాళం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. చిరంజీవి ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను చూడలేకపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రవితేజ చేసిన రావణాసుర సినిమా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రావణాసుర బెంగాళీ ఫిల్మ్ విన్సీదాకు రీమేక్ గా వచ్చి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
తమిళ మూవీ వినోదాయ సీతంను బ్రో గా చేసిన పవన్, సాయి తేజ్ ఈ సినిమాతో నిరాశ పరిచారు. మరాఠీ మూవీ నట సామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కిన రంగ మార్తాండకు మంచి పేరొచ్చినా బాక్సాఫీస్ దగ్గర మాత్రం డిజాస్టర్ గానే మిగిలింది. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే తెలుగు ఆడియన్స్ రీమేక్ కథల కంటే ఒరిజినల్ కథలకే పెద్ద పీట వేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.













