చిరంజీవికి హ్యాపీ బర్త్‌డే చెప్పిన గవర్నర్
మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవాళ్లు వందలు, వేలు, లక్షల సంఖ్యలో ఉండవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏకైక మెగాస్టార్ ఎన్నోఏళ్లుగా టాప్ ప్లేస్‌లో ఉన్న చిరంజీవికి బర్తడే విషెస్ ఎంత ఎక్కువ మంది చెప్పినా… అందులో పెద్దగా వింతేమీ లేదు. కాని కొందరి నుంచి అనుకోకుండా వచ్చే శుభాకాంక్షలు మాత్రం ఎప్పుడూ విశేషమే. అందులోనూ ఒక రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న ప్రముఖుని నుంచి అంటే అది మరింత కుతూహలం కలిగించేదే.
ఈ సారి అలాంటి కుతూహలం కలగడానికి కారణం తెలంగాణ గవర్నర్ తమిళ్సై. చెన్నైకి చెందిన తమిళ్సై మెగాస్టార్‌కి శనివారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అధ్భుతనటుడని కొనియాడారు. మరెంతో కాలం ఆయన తన సినిమాలు, నటన ద్వారా తెలుగు ప్రజలను అలరించాలని ఆమె ఆకాంక్షించారు.
నటుడిగానే కాక రాజకీయ నాయకుడిగా కూడా ఓ పార్టీని నడిపి, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన చిరంజీవికి గవర్నర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించడంలో పెద్ద వింతేముంది? అనొచ్చు గానీ.. అంత ప్రాధాన్యత ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం కూడా లేదనేది ఇక్కడ గమనార్హం. పైగా తమిళనాడు వాసి అయిన గవర్నర్.. తెలుగు హీరోకి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో విశేషమేనంటున్నారు కొందరు. మరోవైపు పూర్వరంగంలో తెలంగాణ గవర్నర్ భారతీయ జనతా పార్టీ నేత కావడం కూడా చర్చనీయాంశం అయింది.
తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలని చూస్తున్న భాజాపా అందుకు తగినట్టుగా ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతున్న విషయం బహిరంగ రహస్యమే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ని తమతో కలిపేసుకుంది. అలాగే రాజకీయంగా ప్రస్తుతం చురుకుగా లేని చిరంజీవిని కూడా తమవైపు తిప్పుకునే యత్నాలు ముమ్మరం చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎటువంటి రాజకీయ పదవిలో లేని చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భాజాపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కలవడం కూడా చూశాం. ఇవన్నీ భాజాపా భవిష్యత్తు రాజకీయ వ్యూహాలే అనే సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి.













