‘సైరా’ టీజర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌కు వవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించిన ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది.కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘చరిత్ర స్మరించుకుంటుంది..ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు’అంటూ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయే టీజర్ యుద్ద సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి.













