శిష్యుడి కోసం సుకుమార్ నిర్ణయం
గతేడాది రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ కు ఆ సినిమాతో తన లో మంచి ఈజ్ ఉందనే పేరు తెచ్చుకున్నాడు. రౌడీ బాయ్స్ కు అనుకున్న ఫలితం రాకపోయినప్పటికీ ఆ సినిమా ఓ మోస్తరు గా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు ఆశిష్ హీరోగా సెల్ఫిష్ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
లవ్ టుడే హీరోయిన్ ఇవానా ఇందులో ఆశిష్‌కు జోడీగా నటిస్తుంది. దిల్ రాజు బ్యానర్లోనే ఈ సినిమా కూడా రూపొందుంతుంది. కాశీ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కొన్ని నెలల కొందటే మొదలైన ఈ సినిమా షూటింగ్ మొదట్లో చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆ సినిమాను టెంపరరీగా నిలిపివేసినట్లు వార్తలొస్తున్నాయి.
కాశీకి అనుభవం లేకపోవడంతో టేకింగ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడని, స్క్రిప్ట్ లో ఉన్నది తెరపై చూపించడం తన వల్ల కావట్లేదని, బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బందులూ లేకపోయినా, సినిమాలో రిచ్ నెస్ కనిపించడం లేదని తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడిగా దిల్ రాజు దగ్గర ఛాన్స్ కొట్టేసిన కాశీ కోసం ఇప్పుడు ఏకంగా సుకుమారే రంగంలోకి దిగనున్నాడట. ఈ సినిమా రషెస్ ను చూసి స్క్రిప్ట్, టేకింగ్ పరంగా కరెక్షన్స్ సూచించి, సినిమాను తిరిగి పట్టాలెక్కించేలా చేయనున్నాడట సుకుమార్. పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన శిష్యుడి కోసం సుకుమార్ ఈ పనిని చేయబోతున్నాడట. తన శిష్యుడిని సెటిల్ చేయడం ముఖ్యమని భావించే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.













