బ్లాక్ బస్టర్ సీక్వెల్‌కు రంగం సిద్ధం
బాలీవుడ్ లో రికార్డులు సృష్టించిన ఫ్రాంఛైజీ సినిమాల్లో స్త్రీ(Stree) ఒకటి. హారర్ కామెడీ జానర్ లో కొన్నేళ్ల కిందట వచ్చిన స్త్రీ మంచి హిట్ అయింది. రీసెంట్ గా ఆ సినిమాకు సీక్వెల్ గా స్త్రీ2(Stree2) చేస్తే అది సూపర్ డూపర్ హిట్ అయింది. స్త్రీ2 ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకున్న హిందీ మూవీగా రికార్డుకెక్కింది.
స్త్రీ2లో కథ కొత్తగా అనిపించకపోయినా థ్రిల్, ఎంటర్టైన్మెంట్ బాగా వర్కవుట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా లేకపోవడంతో సినిమా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ సంపాదించింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ముందుగానే హింట్ ఇచ్చిన మేకర్స్ సెకండ్ పార్ట్ లాగా ఈసారి ఎక్కువ టైమ్ తీసుకోవడం లేదు.
రీసెంట్ గా శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) దీని గురించి వెల్లడించింది. స్త్రీ చూసినప్పుడు ఇలాంటి మూవీ ఇప్పటివరకు రాలేదనిపించిందని, స్త్రీ2 కథ విని ఆశ్చర్యపోయానని ఆ సినిమా మంచి హిట్ అవడంతో ఇప్పుడు స్త్రీ3 కోసం పనులు జరుగుతున్నట్లు తెలిపింది. అంతేకాదు స్త్రీ2ని మించిన వినోదం స్త్రీ3లో ఉంటుందని, ఇప్పటికే వర్క్ మొదలైందని, కథ పరంగా చాలా డెవలప్ చేస్తున్నారని, తన పాత్ర ఈసారి చాలా బావుంటుందని శ్రద్ధా వెల్లడించింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.













