నాని సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్
హాయ్ నాన్న సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో రానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు సమాచారం. హాయ్ నాన్న రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా నాని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో నానితో పాటూ మరో హీరో కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ హీరోని కూడా సెలెక్ట్ చేశారని, మూవీ అనౌన్స్మెంట్ తో పాటూగా ఈ విషయాన్ని కూడా ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వనున్నారట నిర్మాతలు.
ఇప్పటికే వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికీ సినిమా చేసిన నాని, ఇప్పుడు మరోసారి ఆ డైరెక్టర్ తో జట్టు కట్టనున్నాడు. ఆ సినిమాకు మంచి పేరొచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా వర్కవుట్ అవలేదు. అందుకే ఈసారి వీరి కాంబోలో వస్తున్న సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయ్యేలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారట. ఈ సినిమాతో వివేక్ మరోసారి తన మార్క్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది.













