స్వాతంత్య్ర సమరయోధుడిగా ఎన్టీఆర్ ?
బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు ప్రపంచఖ్యాతిని తీసుకొచ్చారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తాజాగా ఆయన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. టీజర్‌తో సర్వత్రా ఆసక్తికి రేకెత్తించిన రాజమౌళి ఈ చిత్రాన్ని 1947లోని బ్రిటీష్ కాలం నాటి కథ నేపథ్యంలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది. స్వాతంత్ర సమరకాలంలో జరిగిన కొన్ని ఘట్టాల్ని కూడా ఈ చిత్రంలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారని, సినిమాలో ఈ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిసింది. ఇదిలా వుంటే పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.













