శివరాత్రికి సినిమాల హడావిడి
తెలుగు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాశివరాత్రి వచ్చేసింది. మామూలుగా అయితే బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి, దసరా లాంటి పండగలకే హడావిడి ఉండేది కానీ ఈసారి మాత్రం శివరాత్రికి కూడా మంచి పోటీనే ఉంది. భీమా, గామి, ప్రేమలు సినిమాలు మంచి అంచనాలతో శివరాత్రి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇవి కాకుండా శివరాత్రికి స్టార్ హీరోల నుంచి అప్డేట్స్ వస్తాయని వారి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప నుంచి శివరాత్రికి ఓ పవర్ఫుల్ లుక్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆ లుక్ మరెవరిదో కాదు శివుడిగా నటిస్తున్న ప్రభాస్ లుక్కేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాకు డివోషనల్ టచ్ ఉండటంతో ఈ సినిమా నుంచి కూడా ఏదొక అప్డేట్ రావొచ్చు. బాలకృష్ణ 109 నుంచి ఏదైనా లుక్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న కల్కి నుంచి పోస్టర్ లేదా టీజర్ వదులుతారేమో అనుకుంటే చిత్ర బృందం సాంగ్ షూట్ కోసం ఇటలీలో ఉంది కాబట్టి ఇది దాదాపు అసాధ్యమే.
ధనుష్- నాగార్జున- శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న సినిమా తాలుకూ టైటిల్ అనౌన్స్మెంట్స్ శివరాత్రి సందర్భంగా అనౌన్స్ కానుంది. ఆశిష్- వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న లవ్ మి టీజర్ ఇప్పటికీ రెడీ అయింది. ఇవి కాకుండా ఓటీటీలో హనుమాన్ రిలీజయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి టాలీవుడ్ లో శివరాత్రి హడావిడి బాగానే కనిపించేట్లుంది.













