విశ్వంభరలో సిస్టర్ సెంటిమెంట్
భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి మొదట్లో ఈ సినిమా సెట్స్ లోకి చిరూ, త్రిష అడుగుపెట్టారు. రీసెంట్ గా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి చిరూ అమెరికా వెళ్లాడు. మెగాస్టార్ తిరిగి ఇండియా రాగానే విశ్వంభర షూటింగ్ మొదలుకానుంది.
ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలను మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు సార్లు చెప్పింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట ప్రచారమవుతుంది. అంతర్గత సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు.
భీమవరం దగ్గరలోని ఓ గ్రామంలో విశ్వంభర స్టోరీ స్టార్ట్ అవుతుంది. పెద్ద కుటుంబం. కానీ తన అయిదుగురు అక్కచెల్లెళ్ల బాధ్యత చిరూ మీదే ఉండటంతో దాని కోసం ఎంతటి కష్టమైనా, సాహసమైనా చేయడానికి వెనుకాడడు. గతంలో ఇలాంటి సిస్టర్ సెంటిమెంట్ తోనే చిరూ నుంచి హిట్లర్ అనే సినిమా వచ్చింది.
అలాగని ఈ సినిమాకూ, ఆ సినిమాకూ పోలిక పెట్టలేం కానీ ఐదుగురు అక్కచెల్లెళ్లున్నారంటే సినిమాలో సెంటిమెంట్ పాళ్లు కూడా ఎక్కువగానే ఉండే అవకాశముంది. ప్రస్తుతం వశిష్ట ఆ అక్కచెల్లెళ్లను వెతికే పనిలో ఉన్నాడట. కాస్త పేరున్న ఆర్టిస్టులనే తీసుకోవాలని వశిష్ట ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో యువి క్రియేషన్స్ సంస్థ భారీగా ఖర్చు పెడుతోంది.













