20 సంవత్సరాల తర్వాత తెలుగులో రెండు సినిమాలు.. అదీ ఒకే హీరోతో!
హీరోయిన్ శిల్పాశెట్టి అంటే బాలీవుడ్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఆమె వయసు 45 సంవత్సరాలు అయినప్పటికీ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా తన ఫిజిక్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటుంది. ఫిట్నెస్కి సంబంధించిన డిస్కషన్ ఏదైనా వచ్చినపుడు తప్పకుండా శిల్పాశెట్టి పేరును ప్రస్తావిస్తారు. బాలీవుడ్లో `బాజీగర్` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శిల్ప ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన `సాహసవీరుడు సాగరకన్య` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత మోహన్‌బాబుతో `వీడెవడండీ బాబూ`, నాగార్జునతో `ఆజాద్`, బాలకృష్ణతో `భలేవాడివి బాసూ` చిత్రాల్లో నటించింది. 2001లో వచ్చిన ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు.
ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది శిల్పాశెట్టి. అది ఒకటి కాదు, ఒకేసారి రెండు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పింది శిల్ప. ఆ రెండు సినిమాలూ నితిన్ హీరోగా నటిస్తున్నవే కావడం విశేషం. నితిన్, వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందుతున్న `రంగ్‌దే`, నితిన్, మేర్లపాక గాంధీ కాంబనేషన్లో రూపొందనున్న `అంధాధున్` రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శిల్ప. 2009లో పెళ్లి చేసుకున్న తర్వాత అడపా దడపా ఓ నాలుగైదు సినిమాలు చేసిన శిల్పా టీవీ ప్రోగ్రామ్స్‌తో ఎక్కువ బిజీ అయిపోయింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్లీ నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న శిల్పాకి మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.













