ప్లాన్ మార్చనున్న శంకర్
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒకేసారి రెండు పాన్ ఇండియన్ సినిమాలను చేతిలో పెట్టుకుని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. కమల్ హాసన్ తో ఇండియన్2, మరోవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ పనులు శంకర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే దేవర గురించి వస్తున్న వార్తలు చూసి శంకర్ తన గేమ్ ప్లాన్ మార్చనున్నాడని తెలుస్తోంది.
సైఫ్ అలీ ఖాన్ కు గాయాలై, సర్జరీ అవడంతో దేవర షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో సినిమా అనుకున్న టైమ్ కు రాదని, పోస్ట్ పోన్ అవడం ఖాయమని నెట్టింట వార్తలొస్తున్నాయి. ఒకవేళ నిజంగా దేవర పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ ను ఇండియన్2 కు వాడుకుంటే ఎలా ఉంటుందనే దిశగా శంకర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదట్లో ఇండియన్ 2ను ఏప్రిల్ 12న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పడు దేవర వాయిదా పడితే ఏప్రిల్ 5 లాంగ్ వీకెండ్ దొరుకుతుంది కాబట్టి ఆ ప్లేస్ ను ఆక్యుపై చేయాలని చూస్తున్నాడట శంకర్. అందుకే ఇండియన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా శంకర్ వేగవంతం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దేవర తప్పుకుంటే చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.













