నాగచైతన్య ‘సవ్యసాచి’ ఫస్ట్‌లుక్ విడుదల
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో చైతన్య నలుపు రంగు దుస్తుల్లో తలపై గాయంతో కోపంగా చూస్తున్నట్లు కన్పించారు. ఆయన వెనక తొమ్మది చేతులు చాచినట్లుగా ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. ‘రెండు చేతుల్ని సమర్థంగా, శక్తివంతంగా వాడే వారిని సవ్యసాచి అంటారు. మహాభారతంలో అర్జునుడి ఐదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్యను ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో కథానాయకుడు తన రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు’ అంటూ చిత్ర బృందం ఇటీవల సవ్యసాచి గురించి వివరించింది. నాగచైతన్యకి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.













