మీరు లేకపోతే నాకు ఈ స్థానమే లేదు
సమంత తెలుగుతెరకు పరిచయమై తొమ్మిదేళ్లు పూర్తయింది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయా చేశావె సినిమా కోసం నాగచైతన్య, సమంత తొలిసారి జతకట్టారు. ఆ సినిమా విడుదలైన ఏడేళ్ల తర్వాత వివాహబంధంతో ఒకటై భార్యభర్తలుగా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకు అనుకుంటున్నారా? అందుకు ఓ కారణం ఉంది. పైలోకంలో వాడు..ఎప్పుడో ముడివేశాడు.. విడిపోద విడిపోదే అంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఏమాయా చేశావె చిత్ర నిర్మాత మంజుల ఘట్టమనేని ట్వీట్ చేశారు. ఈ సినిమా వచ్చి అప్పుడే తొమ్మిదేళ్లు అయిపోయింది. అయినా నిన్నే అంతా జరిగినట్టుంది. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ అభినందనలు అని మంజుల చేసిన ట్వీట్‌కు సమంత రీ ట్వీట్ చేశారు. నా జీవితాన్ని మార్చేసిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు లేకపోతే నటిగా నాకు ఈ స్థానమే లేదు అని భావోద్వేగంతో సమంత రాసుకొచ్చారు.













