ఏజెంట్‌ను కవర్ చేస్తున్న సామజవరగమన
టాలీవుడ్ లో కాంప్రమైజ్ కాకుండా సినిమాలను నిర్మించే నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. అమెరికాలో పెద్ద వ్యాపారాలున్న అనిల్, ఒకప్పుడు గోపీ ఆచంట, రామ్ ఆచంటతో కలిసి 14 రీల్స్ బ్యానర్లో సినిమాలను నిర్మించేవాడు. ఓ వైపు ఆ బ్యానర్ లో పెద్ద సినిమాలను నిర్మిస్తూనే, మరో వైపు తనొక్కడే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చిన్న సినిమాలను తీసేవారు.
తర్వాత పూర్తిగా 14 రీల్స్ బ్యానర్ నుంచి బయటికొచ్చి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే పెద్ద సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టి, హీరోల మార్కెట్ ను మించి బడ్జెట్ తో సినిమాలు తీశాడు. కానీ ఆయనకు మంచి రిజల్ట్ మాత్రం దక్కలేదు. ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతిని నమ్మి చేసిన మహా సముద్రం సినిమా ఆయనకు డిజాస్టర్ ను మిగిల్చింది.
తర్వాత అఖిల్ తో ఏజెంట్ సినిమా చేసి తన కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా నష్టపోయాడు. ఇంకా హీరోగా సెటిల్ కాని అఖిల్ మీద రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి ఏజెంట్ సినిమా చేశాడు. షూటింగ్ టైమ్ లోనే అనిల్ ను బడ్జెట్ విషయంలో ఎంతో మంది హెచ్చరించినా అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి మీదున్న నమ్మకంతో సినిమాను భారీగా తెరకెక్కించి దారుణమైన ఫలితాన్ని అందుకున్నాడు.
అయితే ఇప్పుడు అనిల్ సుంకర నుంచి వచ్చిన చిన్న బడ్జెట్ సినిమా సామజవరగమన. ఈ సినిమాకు ఏజెంట్ కు పెట్టిన బడ్జెట్ లో 5% కూడా పెట్టలేదు. కానీ ఈ సినిమా ఫలితం అనిల్ కు మంచి ఉపశమనాన్నిస్తుంది. చిన్న సినిమాగా రిలీజైన సామజవరగమన ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. ఫుల్ రన్ లో సినిమా రూ.20 కోట్ల షేర్ ను అందుకునేట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఏజెంట్ ద్వారా గాయపడ్డ అనిల్ కు సామజవరగమన మంచి ట్రీట్మెంట్ ఇస్తోందన్నమాట.













