‘మర్డర్` వివాదం విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా? అందుకే వెనక్కి తగ్గాడా?
పిల్లల్ని ప్రేమించడం తప్పా?… తప్పు చేస్తే దండించడం తప్పా?… నచ్చినోడ్ని ప్రేమించడం తప్పా?.. నచ్చినపుడు కలిసుండడం తప్పా..? ఇవీ `మర్డర్` సినిమాలోని రెండు కోణాలు. ప్రణయ్ హత్య కేసు నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న `మర్డర్` సినిమా వివాదాలకు నెలవుగా మారింది. తన అనుమతి లేకుండా తమ ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడని రామ్‌గోపాల్‌వర్మపై ధ్వజమెత్తింది అమృత. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ హత్యకు సంబంధించి ఎన్నో విషయాలు తెలిసాయని, వాటి ఆధారంగానే సినిమా తీస్తున్నాను తప్ప ఎవరి జీవిత కథ ఇందులో లేదని అంటున్నాడు వర్మ. ఇలాంటి కథలతో అనేక సినిమాలు వచ్చాయని, అలాంటి కథే ఈ సినిమాలోనూ ఉంటుందని, సినిమాలో ఎవరినీ టార్గెట్ చేయలేదని వర్మ సమర్థించుకుంటున్నాడు.
ఈ సినిమాపై అమృత కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా సినిమా తీశాడని అమృత, తనను విలన్‌గా చూపిస్తూ సినిమా తీశాడని అమృత తండ్రి అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన రెండు పాటలను రిలీజ్ చేశాడు వర్మ. `పిల్లల్ని ప్రేమించడం తప్పా?… తప్పు చేస్తే దండించడం తప్పా?…` అంటూ ఒక పాట సాగితే, `నచ్చినోడ్ని ప్రేమించడం తప్పా?.. నచ్చినపుడు కలిసుండడం తప్పా..?` అంటూ మరో పాట సాగుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇరువర్గాలకు సంబంధించిన సమస్యలను, వారి ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాడని తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు ఎవరేమనుకుంటే నాకేంటి, నేను సినిమా తీస్తాను, రిలీజ్ చేస్తాను అని ఎంతో పట్టుదలగా ఉన్న వర్మ ఉన్నట్టుండి రెండు వైపులవారిని బుజ్జగించే స్థితికి ఎందుకు వచ్చాడు? పరిస్థితి చేయిదాటి పోతోందని గ్రహించి కథలో మార్పులు చేశాడా? అనే అనుమానం అందరికీ కలుగుతోంది. ఇందులో ఎవ్వరినీ తప్పు బట్టడానికి లేదని, అది అలా జరిగిపోయింది అంతే అనే ధోరణి కనబరుస్తున్నాడు వర్మ. ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న సినిమా రిలీజ్‌కి రెడీ అయింది.
ఈ విషయంలో ఎక్కువ రాద్ధాంతం చేస్తే సినిమా రిలీజ్ ఎక్కడ ఆగిపోతుందోనని వర్మ టెన్షన్ పడుతున్నాడని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా ఈమధ్యకాలంలో వర్మ ఇలా వెనుకడుగు వేసిన సందర్భాలు చాలా తక్కువ. `మర్డర్` విషయంలో కాంప్రమైజ్ అయినట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో వర్మకే తెలియాలి.













