గాంజా శంకర్ మౌనం వెనుక కారణాలేంటి?
గతేడాది విరూపాక్షతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ, తర్వాతి సినిమాగా గాంజా శంకర్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాను అనౌన్స్ చేసి నెలలు దాటింది. అప్పుడెప్పుడో అక్టోబర్ లో ఈ సినిమాకు సంబంధించిన చిన్న కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు.
తర్వాత మళ్లీ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. నిర్మాత నాగవంశీ సైతం ఈ సినిమా గురించి సైలెంట్ గా ఉంటున్నాడు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం బడ్జెట్ సమస్యలట. ముందుగా అనుకున్న దానికంటే గాంజా శంకర్ కు బడ్జెట్ ఎక్కువ అవుతుందట.
ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు రాకపోవడంతో కేవలం థియేట్రికల్ రైట్స్ తో అంత మొత్తాన్ని వెనక్కు రాబట్టడం కష్టమని బడ్జెట్ తగ్గించడానికి ఏం చేయాలో ఆలోచించే పనిలో దర్శక నిర్మాతలున్నట్లు సమాచారం. ఇక సినిమా విషయానికొస్తే గాంజా శంకర్ లో సాయి ధరమ్ తేజ్ ను ఎప్పుడూ చూడనంత ఊర మాస్ లుక్ లో చూపించనున్నాడట సంపత్ నంది. సంపత్ గత సినిమా సీటీ మార్ కు కూడా బడ్జెట్ సమస్యలను ఎదుర్కొన్న సంపత్, ఈ సినిమా బడ్జెట్ ఇబ్బందులను ఎలా ఫేస్ చేసి, సినిమాను ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.













