పత్తి రైతుల సమస్యలపై పోరాడనున్న రవితేజ
ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఈగల్ కూడా ఒకటి. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోటీ ఎక్కువ ఉండటంతో వాయిదా వేసుకుని ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాము ఈ సినిమాతో ఎలాంటి ప్రయోగం చేయలేదని, పక్కా కమర్షియల్ మూవీగా అన్ని అంశాలు ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ హామీ ఇచ్చారు.
రవితేజకు కూడా ఈ సారి నిరాశపరచమని హామీ ఇచ్చారు. ట్రైలర్ చూశాక జనాలకు ఎక్కువగా యాక్షన్ కనిపిస్తుందని కానీ ఈగల్ లో అసలు కథ వేరే ఉందట. రవితేజ పోషించిన ఈగల్ క్యారెక్టర్ పత్తి రైతుల సమస్యల మీద పోరాడే విధంగా డిజైన్ చేశారట. అలా అని పెద్దగా సందేశాలేమీ ఉండవు కానీ అంతర్లీనంగా మెసేజ్ ఇస్తూనే మాస్ ఆడియన్స్ కు ఊగిపోయే ఎపిసోడ్స్ చాలానే సినిమాలో పెట్టారని ఇన్ సైడ్ టాక్.
సినిమాలో కొన్ని షాట్స్ చాలా అద్భుతంగా వచ్చాయని, ప్రమోషన్స్ లో భాగంగా ముందుగానే రివీల్ చేస్తే థ్రిల్ తగ్గిపోతుంది కాబట్టి కావాలనే వాటిని బిగ్ స్క్రీన్ పైన రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా రవితేజనే ఇందులో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తాడు. మరి ఈగల్, రవితేజకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













