మరోసారి ఆ బ్యానర్ లో రవితేజ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌కు, మాస్ మహారాజా రవితేజకు సింక్ బాగా కుదిరినట్లుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలొచ్చాయి. వాటి లో మొదటిది ధమాకా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. రెండో సినిమా ఈగల్ అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేదు కానీ మంచి ప్రయత్నమని పేరైతే వచ్చింది. మూడో సినిమాగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మంచి బజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ కాంబోలో నాలుగో సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమాను సెట్ చేసే పనిలో ఉందట. బాబీ డైరెక్టర్ గా పరిచయమైంది రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమాతోనే.
ఆ సినిమా తర్వాత బాబీకి వరుస అవకాశాలొచ్చి, సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య టైమ్ లో రవితేజకు బాబీ ఓ కథ చెప్పడం, ఆ కథ రవితేజకు నచ్చడం కూడా జరిగిపోయాయట. బాలయ్య సినిమాను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని చూస్తున్న బాబీ, ఆ తర్వాత రవితేజ స్టోరీ మీద కసరత్తులు చేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మిస్టర్ బచ్చన్ తర్వాత సితార బ్యానర్ లో సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. దాని తర్వాత బాబీతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడని తెలుస్తోంది.













