రానా, రవితేజ హీరోలుగా మలయాళ రీమేక్
మలయాళంలో సూపర్‌హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియమ్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ, రానాలతో రీమేక్ చెయ్యాలని అనుకున్నారు. అయితే ఈ రీమేక్‌లో నటించేందుకు బాలకృష్ణ ఆసక్తి చూపించకపోవడంతో ఆ క్యారెక్టర్‌కి రవితేజను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
పృథ్విరాజ్, బిజు మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 60 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. పాచి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. బిజు మీనన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నటించాడు. తెలుగులో ఆ క్యారెక్టర్‌కి రవితేజ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని భావించిన చిత్ర యూనిట్ అతన్నే ఫైనల్ చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్ట్ నుంచి ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? మిగతా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే టోటట్గా సినిమా రన్ టైమ్ మూడు గంటల ఐదు నిమిషాలు. ఇంత లెంగ్త్ ఉన్న సినిమాని ఆడియన్స్ ఓపికగా చూడగలుగుతారా? ఇదే విషయంలో చిత్ర యూనిట్ కూడా ఆలోచిస్తోంది. ఈ కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి, తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది.













