ఆ హీరోతో సై అంటున్న రష్మిక
మాస్ మహారాజా రవితేజతో నేషనల్ క్రష్ రష్మిక జత కట్టబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. రష్మిక ఇప్పటికే చాలా మంది హీరోలతో నటించినప్పటికీ ఇప్పటివరకు రవితేజతో సినిమాలు చేసింది లేదు. దానికి తోడు రష్మిక చాలా వరకు చేసిన సినిమాలు క్లాస్ టచ్ ఉన్నవే. ఇప్పుడు రవితేజతో పక్కా మాస్ సినిమా చేయబోతుంది రష్మిక.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ అన్నీ సూపర్ హిట్లు కావడంతో వీరిది సూపర్ హిట్ కాంబో అయింది. క్రాక్ తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఓ సినిమాను అనౌన్స్ చేయడంతో సినిమా అనౌన్స్మెంట్ తోనే దీనికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపించగా ఆఖరికి రష్మికకు ఆ అవకాశం ఇచ్చారు మేకర్స్.
ఓ హిందీ సినిమా కోసం రష్మిక, నితిన్-వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రష్మిక డేట్స్ కొన్ని వేస్ట్ అయ్యాయి. సరిగ్గా అదే టైమ్ లో రవితేజ సినిమా ఆఫర్ రావడంతో రష్మిక వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. కారంచేడు ప్రాంతంలో జరిగిన ఊచకోత నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.













