మూడున ఐదో శక్తి వస్తోంది
విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతు చిక్కని ఓ అద్భుత శక్తి అది. దాని అదుపు చేయడం కోసం రోబో చిట్టి ఏం చేశాడో తెలియాలంటే 2.ఓ చూడాల్సిందే. రజనీకాత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అమీజాక్సన్ కథానాయిక. అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటించారు. శంకర్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. వచ్చే నెల 3న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. ఐదో శక్తి వస్తోంది అంటూ చిత్రబృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రంలో అక్షయ్ డార్క్ సూపర్‌హీరోగా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర శక్తిమంతంగా ఉండటంతో పాటు విచిత్రమైన రూపంలో ప్రేక్షకుల్ని కనువిందు చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, త్రీడీ చిత్రంగా రూపొందించారు. రూ.400 కోట్ల వ్యయంతో తమిళం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ చిత్రాన్ని 13 భాషల్లోకి అనువదించనున్నారు. నవంబరు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూర్చారు.













