అనుకున్నది దొరికిందా లేక కాంప్రమైజ్ అయ్యాడా?
90వ దశకంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఒకడు. మగాడు, అల్లరి ప్రియుడు, అంకుశం లాంటి సినిమాలతో ఆయన మంచి హిట్స్ అందుకున్నాడు. కానీ 2000 సంవత్సరం తర్వాత ఆయన ఖాతాలో సరైన హిట్లు పడలేదు. కొన్నేళ్ల పాటూ అసలు ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది.
ఇక రాజశేఖర్ ఎరా ముగుస్తుందన్న టైమ్ లో గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గరుడవేగ సక్సెస్ ఊపులో కల్కి సినిమా చేశాడు. ఆ సినిమాకు కూడా మంచి హైప్ దక్కింది. కానీ రిలీజ్ తర్వాత వచ్చిన రిజల్ట్ మాత్రం రాజశేఖర్ కు నిరాశే మిగిల్చింది. ఆ తర్వాత శేఖర్ అనే సినిమా చేశాడు కానీ అసలు ఆ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.
శేఖర్ తర్వాత రాజశేఖర్ మళ్లీ మరో సినిమా చేసింది లేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలంతా హీరోలుగా తమను ప్రూవ్ చేసుకుంది చాలనుకుని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిలైపోతున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం తనకు ధృవలో అరవింద స్వామి లాంటి క్యారెక్టర్స్ వస్తే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయనని ఎప్పుడో ఓపెన్ గా చెప్పాడు.
అలాంటి రాజశేఖర్ ఇప్పుడు నితిన్, వక్కంతం వంశీ కలయికలో వస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ పాత్ర ఆయన అనుకున్నట్లు అరవింద స్వామి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్నా లేక సినిమాలు లేక కాంప్రమైజ్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో మాత్రం ఆయన క్యారెక్టర్ క్లిక్ అయితే తన కెరీర్ మారినట్లే అవుతుంది.













