పురుషులు వాటికి అతీతులా?: ప్రియాంక చోప్రా
బాలీవుడ్ అగ్ర నాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా, పాప్‌సింగర్, హాలీవుడ్ నటుడు నిక్‌జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల వయోభేదం ఉంది. ప్రియాంక కంటే నిక్‌జోనస్ పదేళ్లు చిన్నవాడు కావడంతో సోషల్‌మీడియాలో ఈ జంటపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భార్య కంటే భర్త చిన్నవయస్కుడు కావడం సంప్రదాయానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ప్రియాంక చోప్రా ఘాటుగా స్పందించింది. స్వచ్ఛమైన ప్రేమకు కులమతాలు, వయోభేదాలు అడ్డురావని సృష్టం చేసింది. తమకంటే చాలా చిన్న వయసున్న యువతుల్ని పెళ్లి చేసుకున్న మగవారిని ప్రశ్నించని ఈ సమాజం ఆడావాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లయిన ఇన్ని రోజులవుతున్నా మా ఇద్దరి మధ్య వయసు తేడా గురించి చర్చించుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. ఒకవేళ నిక్ నాకంటే పదేళ్లు పెద్దవాడయ్యుంటే అసలు ఈ అంశం చర్చకు వచ్చేది కాదు. నియమాలు కేవలం ఆడవాళ్లకే వర్తిస్తాయా? పురుషులు వాటికి అతీతులా? స్త్రీలపై ఆంక్షలు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నిచింది ప్రియాంక. ఇద్దరు పరస్పరం గౌరవించుకుంటూ సౌకర్యవంతంగా జీవించడమే పెళ్లి ఉద్దేశమ్యని, వయో భేదాలు గురించి చర్చే అనవసరమని పేర్కొంది.













