చిరూ కోసం ట్రై చేస్తున్న ప్రశాంత్ వర్మ?
ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అని ఆడియన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశ తీరడానికి చాలానే టైమ్ పట్టేట్లుంది. దానికి కారణం ప్రశాంత్ వర్మ చేస్తున్న ప్లానింగే. హనుమంతుడి క్యారెక్టర్ కోసం పాత్రధారిని సెలెక్ట్ చేయడానికే ప్రశాంత్ కు చాలా టైమ్ అవసరమవుతుంది.
హనుమాన్ లో లాగా ఈ సినిమాలో తేజ సజ్జ మీద స్టోరీ నడిపించాలంటే కుదరదు. హనుమంతుడి విన్యాసాలపైనే జై హనుమాన్ కథ ఉంటుంది. ఆ స్టోరీని ఇప్పుడు జరుగుతున్న కథకు ముడిపెడతారట. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాకు న్యాయం చేయాలంటే కచ్ఛితంగా పెద్ద స్టార్ నటుడే కావాలి. ఆ పాత్రకు మెగాస్టార్ చిరంజీవి అయితేనే బాగా సెట్టవుతారని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట.
ప్రశాంత్ వర్మ అనుకోవడంలో తప్పు లేదు కానీ చిరూ కూడా ఫ్రీగా ఉండాలిగా. ఎందుకంటే ప్రస్తుతం విశ్వంభర అనే ఫాంటసీ మూవీ చేస్తున్న చిరూ మళ్లీ వెంటనే జై హనుమాన్ చేస్తాడా అన్నది ఒక ప్రశ్న అయితే విశ్వంభర తర్వాత మోహన్ రాజాతో ఓ సినిమా చేయనున్నాడంటున్నారు. ఒకవేళ జై హనుమాన్ స్క్రిప్ట్ నచ్చినా కానీ చిరూ వెంటనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేడేమో. ఇంటిదైవం క్యారెక్టర్ లో నటించమంటే చిరూ కాదనే ఛాన్స్ ఉండదేమో కానీ అనుకుంటే అన్నీ జరగవు కదా. మరి ఈ విషయంలో చిరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ చిరూ ఓకే అంటే ఈలోపు ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను చేసుకుంటాడు.













