ప్రభాస్ కోసం మరో నాలుగేళ్లు ఆగాల్సిందే
గతేడాది సలార్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడి అనే సినిమా చేస్తున్నాడు. ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మే నెలలో రిలీజ్ కానున్న కల్కి పాన్ వరల్డ్ రేంజ్ లో ఏకంగా 22 భాషల్లో రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.
కల్కి సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దీంతో పాటూ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు. కన్నప్ప ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటూ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న రాజా సాబ్ సినిమా ఈ ఏడాది ఆఖరుకి లేదా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
వీటి తర్వాత సలార్2, కల్కి సీక్వెల్స్ ను చేయనున్నాడు ప్రభాస్. సలార్ మంచి హిట్ అవడంతో సలార్2 పై భారీ అంచనాలున్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు. 2026లో స్పిరిట్ రిలీజయ్యే ఛాన్సుంది. ఇవన్నీ పూర్తయ్యాక హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీని చేయనున్నాడు ప్రభాస్.
వీటితో పాటూ లోకేష్ కనగరాజ్, ప్రభాస్ తో ఓ సినిమా చేస్తానని గతంలో వెల్లడించాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను చేయనున్నట్లు లోకేష్ చెప్పాడు. మొత్తానికి ప్రభాస్ తో ఎవరైనా సినిమా చేయాలంటే ఎంత లేదన్నా కనీసం నాలుగైదేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ లైనప్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోగా ప్రభాస్ మాత్రమే ఉన్నాడని అందరూ అంటున్నారు.













