నాని కథతో ప్రభాస్ సినిమా?
టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ గా హను రాఘవపూడికి మంచి పేరున్నప్పటికీ సీతారామం సినిమా ముందు వరకు తన జర్నీలో సక్సెస్ లు ఎక్కువ లేవు. తాను చేసిన ప్రతీ సినిమాలోనూ విజువల్ పొయెట్రీతో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అయితే సీతారామం సినిమా అతడి కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా రిజల్ట్స్ ఆయనపై అంచనాలను భారీగా పెంచింది.
దాని వల్లే ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో అడ్జస్ట్ అయిన హను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అయితే పాన్ ఇండియా హీరోతో చేస్తున్న సినిమా అయినప్పటికీ హను మాత్రం మీడియం రేంజ్ హీరో కోసం రెడీ చేసిన కథతోనే సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కృష్ణ గాడి వీర ప్రేమగాథ తర్వాత నానితో మరో మూవీ చేయాలని హను డిస్కషన్స్ చేసిన కథ ఇదేనని అంటున్నారు. అది యుద్ధ నేపథ్యంలో నడిచే లవ్ స్టోరీ అని, సీతారామం కాకుండా వేరే కథ అని గతంలో హను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు హను ప్రభాస్ తో చేయబోయే సినిమా కూడా యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథనే అని తెలుస్తోంది. దీంతో గతంలో నానితో చేయాలనుకున్న సినిమా కథనే కాస్త మార్చి, భారీ కాన్వాస్ తో ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ప్రభాస్ తో చేస్తున్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది హను క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.













