‘ప్రభాస్ 20’ టైటిల్, ఫస్ట్‌లుక్ వచ్చేస్తున్నాయ్!
ఇప్పుడు అందరి దృష్టీ ప్రభాస్ చేస్తున్న 20వ సినిమాపైనే ఉంది. `సాహో` తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాలా నిరాశపరుస్తుందా లేక ప్రభాస్‌కి మరో పెద్ద హిట్ ఇస్తుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా టైటిల్ అంటూ ఇప్పటికే చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే అధికారికంగా ఇప్పటివరకు టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదు. ఇప్పడు ఆ సమయం వచ్చేసింది. జూలై 10న ఉదయం 10 గంటలకు టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామంటూ ప్రకటించాడు దర్శకుడు రాధాకృష్ణకుమార్. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతభాగం యూరప్‌లో జరిగింది. కరోనా వల్ల లాక్డౌన్ విధించడం వల్ల షూటింగ్ ఆపేసి చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. దీంతో హైదరాబాద్‌లోనే యూరప్ స్ట్రీట్స్, ఒక హాస్పిటల్ సెట్ వేశారు. ఇకపై ఎక్కువ భాగం షూటింగ్ ఆ సెట్లో జరుగుతుందట. అయితే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం వల్ల ఆ సెట్లో షూటింగ్ చెయ్యాలన్న ఆలోచనను విరమించుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ సెట్లోనే షూటింగ్ ప్రారంభిస్తారు.













