రవితేజతో రొమాన్స్ చేయనున్న పూజా
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయన సినిమాల్లో హీరోయిన్లు కూడా ఆయన ఇమేజ్ కి తగ్గట్టే ఉంటారు. రవితేజ నటించే ఏ సినిమాలో అయినా సరే ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లకే మేకర్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదిలా ఉంటే రవితేజ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్న రవితేజ గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. ఇప్పటికే రవితేజ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాల షూటింగ్ లో సమాంతరంగా పాల్గొంటూ ఆ రెండు సినిమాలను పూర్తి చేస్తున్నాడు. అలాంటి టైమ్ లో గోపీచంద్ సినిమా అనౌన్స్ కావడం అంటే షాకయ్యే విషయమే.
గోపీచంద్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను వేగంగా జరుపుకుంటున్నట్లు టాక్. ఇందులో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ సెలెక్షన్ పై ఇప్పుడు ఓ తాజా వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా నటించేందుకు పూజా హెగ్డేను తీసుకోవాలని మేకర్స్ చూస్తున్నారట. ఇందులో భాగంగానే ముంబైలో పూజాని సంప్రదించినట్లు టాక్.
అన్నీ కుదిరితే రవితేజతో పూజా రొమాన్స్ చేయడం ఖాయం. కానీ పూజాని ఈ టైమ్ లో లాక్ చేయడం అంత ఈజీ కాదు. డేట్స్ అడ్జస్ట్ చేయలేక మహేష్ సినిమానే వదిలేసుకున్న పూజాకి ఈ క్యారెక్టర్, కథ నచ్చితే కానీ తను డేట్స్ ఇవ్వదు. దానికి తోడు పూజా గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి రవితేజ కోసం పూజ ఏమైనా మనసు మార్చుకుని డేట్స్ అడ్జస్ట్ చేస్తుందేమో చూడాలి.













