పవన్ కొత్త సినిమా.. ఫ్యాన్స్ కూడా నమ్మేట్టు లేరు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకలాపాల్లో ఉన్నాడు. దీంతో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితుల్లో అస్సలు లేడు. దీని గురించి పవన్, తన నిర్మాతలకు కూడా చెప్పడంతో వారు కూడా సైలెంటయ్యారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.
అవి పూర్తి చేయాలంటే చాలానే టైమ్ పట్టనుంది. కాబట్టి కొత్తగా కథలు వినే టైమ్ కానీ, సినిమాలు చేసే తీరిక కానీ పవన్ కు లేవు. ఒకవేళ ఏపీ ఎన్నికల ఫలితం టీడీపీ, జనసేనకు అనుకూలంగా వస్తే పవన్ సినిమాల్లోకి రావడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. పవన్ సినిమా షూటింగ్ లకు అందుబాటులోకి వచ్చాక ముందుగా ఓజీ సినిమా కంప్లీట్ చేయాలి.
ఒక్క 30 రోజులు డేట్స్ ఇస్తే ఓజీకు గుమ్మడికాయ కొట్టడానికి చూస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ఇక హరీష్ శంకర్ కూడా పవన్ ఏ నిమిషంలో వచ్చినా సినిమాను చకాచకా పూర్తి చేయడానికి ముందునుంచే రెడీగా ఉన్నాడు. వీరమల్లుకు ఎలాగూ చాలానే టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. పవన్ ఇవన్నీ పూర్తి చేయాలంటే చాలానే టైమ్ పడుతుంది. ఇంత టైట్ షెడ్యూల్ తో ఉన్న పవన్ త్రివిక్రమ్, అట్లీతో కొత్తగా కథలు విని సినిమాలు చేసేంత ఖాళీ ఎక్కడుంది? అందుకే పవన్ కొత్త సినిమాల గురించి ఏ వార్త వచ్చినా నమ్మడానికి ఆయన ఫ్యాన్స్ రెడీగా లేరు.













