రానాకి సెట్టయింది.. పవన్ కళ్యాణ్ సంగతి తెలియాల్సి ఉంది!
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీగా గడిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు మరియు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ వంటి సినిమాలను వెంటవెంటనే పట్టాలెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. దిల్ రాజు- బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఏప్రిల్ 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
సాగర్ కె చంద్ర డైరక్షన్ లో రానా తో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే దాదాపు 40 % షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమా, మే నెలలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో రానా సరసన నటి ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ సరసన నటించే కథానాయిక ఎవరనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మే నెలలో ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని నిర్మాత నాగవంశీ గారు వెల్లడించారు.













