భారతీయ నటులకు ఆస్కార్ ఆహ్వానం
ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రతిష్ఠాత్మక పురస్కారాలంటే ఆస్కార్ పేరు చెబుతారు. అలాంటి ఆస్కార్ పురస్కారాలను అందించే అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్షర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో ఈసారి పలువురు భారతీయ సినీ ప్రముఖుల చోటు దక్కించుకోవడం విశేషం. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, టబు, నసీరుద్దీన్ షా, అలీ ఫజల్లతో పాటు బెంగాలీ నటులు మదాబీ ముఖర్జీ, సౌమిత్ర ఛటర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాలకు ఆస్కార్ అకాడెమీ ఆహ్వానించింది. వీరిలో పాటు సాంకేతిక విభాగాల నుంచి మరో తొమ్మిది మందికి కూడా అకాడెమీ ఆహ్వానం అందింది. 2018కి గానూ వీరు అకాడెమీ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
ఈ ఏడాది ఆస్కార్ విజేతల ఎంపికలో వీరి భాగస్వామ్యం కూడా ఉంటుందన్నమాట. కొంతకాలంగా అకాడెమీ సభ్యుల్లో శ్వేతజాతీయులే ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాంతో పాటు మహిళా ప్రాతినిధ్యం కూడా చాలా తక్కువగా ఉంటోంది. ఈ ధోరణికి వ్యతిరేకంగా ఆస్కార్స్ సో వైట్ నినాదంతో పలువురు తారలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇక నుంచి భిన్న ప్రాతినిధ్యం ఉండేందుకు అకాడెమీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 59 దేశాల నుంచి 928 మంది కొత్త సభ్యులుగా ఆహ్వానించింది. వీరిలో 49 శాతం మహిళలకు చోటు కల్పించడంతోపాటు 38 శాతం సభ్యులు శ్వేతయేతర జాతీయులుగా ఉండేలా జాగ్రత్త తీసుకుంది.













