సోషల్ మీడియాలో తనకు వచ్చిన బెదిరింపును పట్టించుకోని కంగనా రనౌత్!
సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను సహించలేనివారికి, సంఘవిద్రోహులను నిలదీసేవారికి రకరకాల బెదిరింపులు రావడం సహజం. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలాంటివారిలో కంగనా రనౌత్ ఒకరు. సమాజంలో జరిగే కొన్ని దురదృష్టకర ఘటనలపై ఆమె స్పందన ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగల ఏకైక హీరోయిన్ కంగనా రనౌత్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి ఉదాహరణ ఇటీవల బాలీవుడ్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలే. ఎక్కడ ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో స్పందించే కంగనా డ్రగ్స్ వ్యవహారంలోగానీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలోగానీ ఆమె వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఆమెకు వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఆమెను ఇటీవల సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఆమె తన సోదరుడి పెళ్లి పనుల్లో మునిగిపోయి ఉంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశాకు చెందిన ఒక న్యాయవాది ఫేస్బుక్ ఎకౌంట్ నుంచి ఒక బెదిరింపు వచ్చింది. నిన్ను నడిరోడ్డుపై రేప్ చేస్తానంటూ ఆ న్యాయవాది ఆమెను బెదిరించాడు. ఇది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై స్పందించిన ఆ న్యాయవాది ఈ బెదిరింపు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఎకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి తన పేరుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరణ ఇచ్చాడు. తనకు సమాజం పట్ల బాధ్యత ఉందని, మహిళలంటే ఎంతో గౌరవం ఉందని, నా ప్రమేయం లేకుండా నా ఎకౌంట్ నుంచి ఇచ్చిన ఈ బెదిరింపు వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించమని ఫేస్బుక్ ద్వారా కోరాడు. ఇంత జరుగుతున్నా కంగనా మాత్రం ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అసలు ఈ ఘటనపై ఆమె స్పందించలేదు.













