అనిరుధ్ పై దేవర భారం
ఈ రోజుల్లో ఎవరి సినిమాకైనా, ఎలాంటి సినిమాకైనా సరే మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మ్యూజిక్ విషయంలో కోట్లకు కోట్లు రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో దేవర అనే యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దేవరకు అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. మొదట్లో ఈ సినిమాకు అనిరుధ్ ని తీసుకున్నారన్న వార్త వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కానీ మెల్లిగా ఆ ఆనందం కాస్తా ఇప్పుడు నిరాశగా మారుతుంది. దానికి కారణం గత కొన్ని సినిమాలుగా అనిరుధ్ ఇచ్చిన ట్యూన్స్ ఆయన స్థాయికి తగినవి కాకపోవడమే.
జవాన్ సాంగ్స్ విషయంలో మొదలైన ఈ నెగిటివ్ ఫీడ్ బ్యాక్, లియో విషయంలో కూడా కొనసాగుతుంది. ఇలాంటి టైమ్ లో అనిరుధ్ దేవరకు అసలెన్ని ట్యూన్స్ ఇచ్చాడనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తారక్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో కొరటాల చూపించబోతున్నాడు. అలాంటప్పుడు దానికి తగ్గ మ్యూజిక్ కూడా ఉండాలి.
అలా జరగాలంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్ దేవరకు చాలానే టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. దానికితోడు దేవర రెండు భాగాలుగా వస్తుంది కాబట్టి దేవర1కు అనిరుధ్ ది బెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని బట్టే దేవర2కు హైప్ వస్తుంది. మరి అనిరుధ్ తన మీద ఉన్న బాధ్యతను ఏ మేరకు నిర్వర్తిస్తాడో చూడాలి.













