రానా ఆ సీక్వెల్ చేస్తున్నాడా?
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు ప్రతి నాయకుడు పాత్రలు చేస్తూ సాహసం చేసే నటుడు రానా దగ్గుబాటి. తన కోసం రెడీ చేసే ఎలాంటి క్యారెక్టర్ కు అయినా రానా రెడీ అయిపోయి చేసేస్తుంటాడు. విరాటపర్వం తర్వాత రానా నుంచి ఇప్పటివరకు మరో సినిమా వచ్చింది లేదు. హిరణ్య కశ్యప సినిమా ప్లానింగ్ లో ఉంది కానీ అది ఇప్పుడే వచ్చేలా కనిపించడం లేదు.
మరోవైపు రానా, తనకు నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్ ఇచ్చిన తేజతో మరో మూవీ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా నేనే రాజు నేనే మంత్రికి సీక్వెల్ అని కొందరు అంటున్నారు. ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు నవంబర్ 3వ వారంలో ఉండే అవకాశముంది.
సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమాను నేనే రాజు నేనే మంత్రికి సీక్వెల్ అని కొందరంటుంటే, కాదు వీరిద్దరూ ఈసారి కొత్త కథతో రాబోతున్నారని మరికొందరంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో వీరిద్దరే కాకుండా కాజల్‌ను కూడా తీసుకోవాలని చూస్తున్నారట. అదే నిజమైతే సినిమాకు హైప్ రావడం పక్కా. మరి రానాతో తేజ ఈ సారి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.













